: టీఆర్ఎస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలకు కేవలం 8 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, సర్వేలపై తనకు నమ్మకం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే నల్గొండ జిల్లాలో పార్టీ ఫిరాయించిన నేతలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అలా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం కోసం ఖర్చు చేసిన 450 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు ఖర్చుచేసి ఉంటే పేదలకు వైద్యం అంది ఉండేదని ఆయన పేర్కొన్నారు. రెండేళ్లు పారిపాలించిన ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వాల జపం చేయడం సరికాదని ఆయన చెప్పారు. మండలాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఎన్టీఆర్ లాంటి రాజకీయ దిగ్గజానికే ఓటమి తప్పలేదని, కేసీఆర్ బొక్కబోర్లాపడడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడే రోజులు ముందున్నాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్, హరీష్ రావు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.