: ఊగిసలాట నడుమ నామమాత్రపు లాభాల్లో మార్కెట్
గురువారం నాటి భారీ నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. సెషన్ ఆరంభంలో లాభాలు నమోదైనప్పటికీ, ఆ వెంటనే అమ్మకాల వెల్లువతో నష్టాలు, తిరిగి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులతో కొంత లాభం, ఆపై యూరప్ మార్కెట్ల సరళి సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో నష్టాలు... ఇలా సాగిన బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా కంపెనీలు దూసుకెళ్లగా.. మిడ్, స్మాల్ క్యాప్ లు చెప్పుకోతగ్గ లాభాలను గడించాయి. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 30.49 పాయింట్లు పెరిగి 0.11 శాతం లాభంతో 27,673.60 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 10.05 పాయింట్లు పెరిగి 0.12 శాతం లాభంతో 8,583.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.81 శాతం, స్మాల్ కాప్ 0.83 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభపడ్డాయి. గెయిల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, జడ్ఈఈఎల్, ఇన్ ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,973 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,735 కంపెనీలు లాభాలను, 1,060 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,42,311 కోట్లకు పెరిగింది.