: లాస్టులో 500 రూపాయలు ఎవరిస్తే వాళ్లకు ఓటా?... ఇదెక్కడి న్యాయం?: చంద్రబాబు
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం వెలగపూడిలోని సీఎం చాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమం గుర్తుండటం లేదన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ఓట్లు వేసేముందు మాత్రం ఐదు వందల కోసమే చూస్తున్నారని అన్నారు. "ఐదేళ్ల పాటు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి, 5 కేజీల బియ్యమిచ్చి, ఎవరైనా చనిపోతే ఐదు లక్షలిచ్చి, అదే మాదిరిగా ఊర్లలో నీరు లేకపోతే నీళ్లిచ్చి, కరెంటు లేకపోతే కరెంటిచ్చి, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి... వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అన్నీ పెట్టిన తరువాత, లాస్టులో 500 రూపాయలు ఇస్తే... అతను డబ్బిచ్చిన వాళ్లకే ఓటేస్తాడు. ఇదెక్కడి న్యాయం? ఆ ఐదొందలకు, వెయ్యికి... ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులేదు కాబట్టి, రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలి కాబట్టి, ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూస్?" అని అన్నారు.