: ప్రపంచం ప్రమాదస్థితికి చేరుకుంది.. నేను ఎలాంటి సలహాలూ ఇవ్వాలనుకోవడం లేదు: రష్యా మాజీ నేత గోర్బచెవ్
గతంలో ఉక్రెయిన్ వివాదంపై ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా, రష్యాల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిరియాలో ఉగ్రవాదుల అంతు చూస్తామంటూ రష్యా దాడులు మరింత పెంచింది. ఈ అంశంలో చెలరేగిన వివాదంలో అమెరికాకు, తమకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎంతో పెరిగిపోయాయని రష్యా మాజీ అధ్యక్షుడు మైఖేల్ గోర్బచెవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచం మొత్తం ప్రమాదస్థితికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై తాను ఎలాంటి సలహాలు ఇవ్వాలని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితి రాకుండా ఉండాలని, చర్చలు పునఃప్రారంభించాలని ఆయన కోరారు. అప్పట్లో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఉద్రిక్తతలను ఆపేందుకు గోర్బచెవ్ పశ్చిమ దేశాలతో మంచి వైఖరిని అవలంబించారు.