సర్జికల్ దాడుల ఆలోచన ఎవరిదో తెలుసా? యూపీలో వెలుగుచూసిన ఆసక్తికర కథనం!
యూరీపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తరువాత, దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెరిగి, పాకిస్థాన్ పై సైన్యం దాడి చేయాల్సిందేనని ఒత్తిడి పెరిగిన వేళ, పీఓకేపై అర్ధరాత్రి పూట సైన్యం సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులతో కొంత మేరకు భారతీయులు సంతృప్తి చెందారు కూడా. అసలు ఇంతకీ గత నెల 28 రాత్రి జరిగిన దాడుల ఆలోచన ఎవరిది? ఎవరి సలహా తరువాత కేంద్రం దాడులకు పచ్చ జెండా ఊపింది? ఈ విషయం యూపీలోని ముజఫర్ నగర్ లో పోస్టర్ల రూపంలో వెలుగులోకి వచ్చింది.
గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఈ సలహా ఇచ్చారట. దాడులకు సలహా ఇచ్చింది ములాయం అని, ఆయనతో మాట్లాడిన తరువాతనే మోదీ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆర్మీ జవాన్లు అసలైన హీరోలని చెబుతూ, సమాజ్ వాదీ పార్టీ యువనేత మొహమ్మద్ షంషేర్ మాలిక్ వేయించిన పోస్టర్లు వెలిశాయి. పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, వారినెలా దెబ్బకొట్టచ్చన్న విషయాలు ములాయంకు బాగా తెలుసునని మాలిక్ తెలిపారు.
కాగా, ఆ పార్టీలోని కొందరు నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలను, పోస్టర్లనూ ఖండిస్తుండటం గమనార్హం. ములాయం అనుభవజ్ఞుడు కాబట్టి, మోదీయే ఫోన్ చేసి సలహా అడిగి వుంటారని సమాజ్ వాదీ పార్టీ నేత శ్యామ్ లాల్ వివరణ ఇచ్చారు. దాడుల ఆలోచన ములాయందేనని ఎవరూ క్లయిమ్ చేయలేదని తెలిపారు. అయితే, ఈ పోస్టర్లను తొలగించాలని అఖిలేష్ ప్రభుత్వం ఆదేశించక పోవడం గమనార్హం. ఈ పోస్టర్ల అంశం ఇప్పుడు యూపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.