: గుజరాత్ కూరగాయల వ్యాపారుల నిర్ణయంతో పాకిస్థాన్ కు కష్టాలు!


పీవోకేలోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం చేసిన ల‌క్షిత దాడుల త‌రువాత పాక్, భారత్ మధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌ కారణంగా గుజరాత్ నుంచి పాకిస్థాన్‌కి టమోటాలు, మిర్చి ఎగుమతులు ఆగిపోయాయి. గుజ‌రాత్ వ్యాపారులే ఆ దేశానికి ఈ కూర‌గాయ‌ల స‌ర‌ఫ‌రాను నిలిపివేయాల‌ని స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకొని అమ‌లుప‌రుస్తున్నారు. దీని వ‌ల్ల త‌మ‌కు రూ. 3 కోట్ల మేర నష్టం వస్తోన్నా ఆ దేశానికి మాత్రం కూరగాయలు ఎగుమ‌తి చేయ‌బోమ‌ని తేల్చి చెబుతున్నారు. మరోపక్క, దిగుమ‌తులు ఆగిపోయిన కార‌ణంగా పాకిస్థాన్‌లో కూర‌గాయలు, పచ్చిమిర్చి కొర‌త ఏర్పడింది. దీంతో ఆ దేశ‌ ప్రజలు క‌ష్టాల్లో ప‌డ్డారు. అహ్మదాబాద్ నుంచి ప్ర‌తిరోజు 50 ట్రక్కులలో టమోటాలు, మిర్చి వాఘా సరిహద్దు గుండా పాకిస్థాన్ చేరుతాయి. 1997 నుంచి ఇప్పటివరకు కూర‌గాయ‌ల స‌ర‌ఫ‌రా ఆగ‌లేద‌ని, ఇప్పుడు తొలిసారిగా ఆగిపోయింద‌ని ఓ అధికారి తెలిపారు. ఇరు దేశాల మధ్య స‌త్సంబంధాలు నెల‌కొనే వ‌ర‌కు కూర‌గాయ‌లు ఎగుమ‌తి చేయ‌బోమ‌ని చెప్పారు. త‌మ‌కు భార‌త‌ జాతి ప్రయోజనాలే ముఖ్య‌మని, త‌మకు వస్తోన్న న‌ష్టాన్ని ప‌ట్టించుకోబోమ‌ని వ్యాపారులు చెబుతున్నారు. పాకిస్థాన్‌కు త‌ప్ప‌ బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు, కెనడా, సౌత్ ఆఫ్రికాల‌కు కూర‌గాయ‌లు ఎగుమ‌తి కొన‌సాగిస్తున్నామ‌ని వారు చెబుతున్నారు. ఆ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలోని కడీ తాలూకాలో అధికంగా టమోటా పండిస్తారు. అక్క‌డి రైతులు మాట్లాడుతూ ఒక్క టమోటాను కూడా పాక్‌కు ఎగుమ‌తి చేయ‌బోమ‌ని చెప్పారు. పాక్‌ ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ‌జూపినా వాటిని ఎగుమ‌తి చేయ‌బోమ‌ని తేల్చి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News