: ప్లీజ్... మా అత్తయ్యను చూడనివ్వండి: జయలలితకు మేనకోడలినని చెప్పుకుంటున్న యువతి వేడుకోలు
‘జయలలిత నాకు ప్రియమైన అత్తయ్య.. ఆమెను చూసేందుకే ఇక్కడికి వచ్చాను’ అంటూ చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్దకు దీపా జయకుమార్ అనే ఒక యువతి వచ్చింది. జయలలిత వదిన విజయలక్ష్మి కూతురినని చెప్పుకున్న ఆమెను కూడా ఆసుపత్రిలోపలికి అనుమతించలేదు. దీంతో ఆసుపత్రి గేటు వద్ద పడిగాపులు కాస్తున్న ఆమెను మీడియా పలకరించగా, తన అత్తయ్య ఆరోగ్యం బాగుండలేదని సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చేశానని, అయితే, తన అత్తయ్యను చూసేందుకు అధికారులు అనుమతించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా తమ కుటుంబ వివరాలను కూడా ప్రస్తావించింది. జయలలిత సోదరుడు జయకుమార్ అని, ఆయన తన తండ్రి అని చెప్పింది. 1995లో తన తండ్రి చనిపోయినప్పుడు మాత్రమే జయలలిత తమ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లిందని చెప్పింది. అయితే, 2012 లో తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఈ విషయాన్ని జయలలితకు తెలియజేద్దామని అనుకున్న సమయంలో ఆమెను కలవనీయకుండా అధికారులు నాడు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇప్పుడు, కూడా అదేవిధంగా చేస్తున్నారని, తన అత్తయ్యను కలవనీయకుండా అధికారులు చేస్తున్నారని జర్నలిజంలో పీజీ చేసిన దీపా జయకుమార్ పేర్కొంది. కాగా, దీపా జయకుమార్ ప్రస్తుతం చెన్నయ్ లోని టీ.నగర్ లో నివాసముంటోంది.