: జయలలిత ఆరోగ్యంపై పిల్ ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి, తాత్కాలిక ముఖ్యమంత్రి అంశాలపై ట్రాఫిక్ రామస్వామి అనే వ్యక్తి వేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. విచారణకు స్వీకరించిన రెండు నిమిషాల్లోనే పిటిషన్ ను తోసిపుచ్చింది. కేవలం ప్రచారం కోసమే పిల్ వేశారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇన్ని రోజుల సమయమంటూ ఏమీ ఉండదని తెలిపింది. చికిత్స పొందుతున్న వ్యక్తి యొక్క ఫొటోలను విడుదల చేయాలని కోరటం తగదని సూచించింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని... ప్రచార వ్యాజ్యంలా ఉందని వ్యాఖ్యానించింది. రాజకీయాల కోసం పిటిషన్లు వేయడం మంచిది కాదని సూచించింది. హైకోర్టు వ్యాఖ్యల పట్ల ఏఐఏడీఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నాయక్, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అంజన్ తో పాటు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలేలు జయలలితకు వివిధ పరీక్షలను నిర్వహిస్తున్నారు.