: ఆ విషయం అన్నకు మొదట చెప్పింది నేనే!: జూనియర్ ఎన్టీఆర్
‘జగన్ గారితో మన సినిమా కన్ఫామ్ అయిపోయిందని అన్నకు చెప్పింది నేనే’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నాడు. ‘ఇజమ్’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం ఓకే అవగానే తన అన్న కల్యాణ్ రామ్ కు ఆ విషయం మొదట చెప్పింది తానేనని అన్నాడు. అయితే, ఈలోగా, జూనియర్ ఎన్టీఆర్ చేతిలోని మైక్ ను లాక్కున్న కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ‘ఆ న్యూస్ నాకు కరెక్టుగా ఫిబ్రవరి 4, 11.30 గంటలకు తను ఫోన్ చేసి చెప్పాడు. ఐ నెవర్ ఫర్ గెట్ దట్’ అన్నాడు. అనంతరం, జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘దర్శకుడు జగన్ గారితో కల్యాణ్ అన్న కలిసి పని చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ‘టెంపర్’ చేసిన తర్వాత నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికి కారణం జగనే. ఆయనతో కలిసి పనిచేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే, ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక, మా అన్న గురించి మాట్లాడాలంటే.. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.. నాకు అన్నీ అతనే. ఒక నటుడిగా ఈ సినిమా కోసం అన్న చాలా కష్టపడ్డాడు. ఏ విషయంలోనైనా కష్టపడితే ఆ ఫలితం విజయం రూపంలో మనకు దక్కుతుంది. ఈ చిత్రం ద్వారా అన్న విజయం సాధించాలి’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.