: నీటి గుంత వద్ద సెల్ఫీకి ప్రయత్నం... ఇద్దరు విద్యార్థుల మృతి
చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ పట్టిపీడిస్తోన్న నయా ట్రెండ్ సెల్ఫీ కారణంగా ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా ఆ సరదా నుంచి బయట పడలేకపోతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో సెల్ఫీ సరదాకి ఈరోజు మరో రెండు ప్రాణాలు బలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థులు మానసాహిల్స్ సమీపంలోని నీటి గుంతల వద్ద సరదాగా గడపడానికి వచ్చారు. నీటి గుంతల్లో ఈత కొట్టేందుకు దిగి, సెల్‌ఫోనులో సెల్ఫీ తీసుకునేందుకు పోజులిచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నంలో వారు ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. నీటిలో దిగకుండా బయట నిలబడి చూస్తోన్న విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించాలని చూశారు. అయితే, ముగ్గురిలో ఒకరిని మాత్రమే వారు రక్షించగలిగారు. నీట దిగిన జుబేద్, షోయబ్ అనే ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. భయంతో ఇద్దరు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోగా మరో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడే ఉన్నారు. స్థానికుల సాయంతో నీటమునిగిన మృతదేహాలను వెలికితీశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.