: పాక్ ఉగ్రవాద ప్రేరేపిత దేశమే.. అమెరికా పిటిషన్‌పై ఐదు లక్షలు దాటిన సంతకాలు
పాకిస్థాన్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలన్న వైట్‌హౌస్ పిటిషన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. సెప్టెంబరు 21న ప్రారంభించిన ఈ పిటిషన్‌పై సంతకాలు చేసేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో లక్ష సంతకాలు వస్తే అమెరికా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. అయితే అనూహ్యంగా ఇప్పటికే సంతకాలు ఐదు లక్షలు దాటాయి. గడువు నాటికి మరో ఐదు లక్షల సంతకాలు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21వ తేదీతో పిటిషన్ గడువు ముగియనుంది. ఆ తర్వాత 60 రోజుల్లో ప్రభుత్వం ఈ పిటిషన్‌పై స్పందించాల్సి ఉంటుంది. మరోవైపు పాక్ ఉగ్రవాద చర్యలపై బ్రిటన్ ప్రజలు కూడా భగ్గుమంటున్నారు. పాక్ ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ఆ దేశ పార్లమెంట్ వెబ్సైట్లోనూ పిటిషన్ పెట్టింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా లక్ష సంతకాలు వస్తే దానిని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చర్చకు పరిగణిస్తారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై పదివేలమందికి పైగా సంతకాలు చేశారు. యూకే పిటిషన్‌కు వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు గడువు ఉంది. కాగా వైట్‌హౌస్ పిటిషన్‌పై సంతకాలు ఇప్పటికే ఐదు లక్షలు దాటడం, తాజాగా యూకే పార్లమెంట్ వెబ్సైట్లోనూ తమకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు కావడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నమ్ముకున్న అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళన చెందుతోంది.