: హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుదామా?: చంద్రబాబుకు ముద్రగడ సవాల్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధైర్యముంటే ఆమరణ దీక్షకు దిగాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు. ఈ ఉదయం చంద్రబాబుకు ఆయన ఓ లేఖను రాశారు. తాను చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలని చంద్రబాబు అనడాన్ని ఈ లేఖలో తప్పుబట్టారు. సమాజంలో వెనుకబడిపోయిన కాపుల భవిష్యత్తు బాగుండాలని తాను ఉద్యమాలు చేస్తుంటే, వాటిని అణచి వేయాలన్న ఉద్దేశంతో కాపులతోనే తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టిన ఆయన, హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే, తాను కూడా ఆ క్షణం నుంచి దీక్షను ప్రారంభిస్తానని, చంద్రబాబు పక్కనే కూర్చుంటానని చెబుతూ, అప్పుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో, ఎవరి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు కూడా దీక్షలు చేశారని గుర్తు చేసిన ఆయన, అవి కూడా దొంగ దీక్షలేనా? అని ప్రశ్నించారు.