: తొలి భార్యను చంపిన కేసులో 15 ఏళ్ల శిక్ష తరువాత పెరోల్ పై వచ్చి, రెండో భార్య సహా పిల్లలందరినీ హత్య చేసిన కర్కోటకుడు!
భార్యను హత్య చేసిన కేసులో 15 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి, ఆపై రెండో పెళ్లి చేసుకుని ఆమెనూ హత్యచేశాడో అమెరికన్. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అది 1991వ సంవత్సరం... డెట్రాయిట్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి తన భార్యను చంపేశానని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లేవరకూ నిందితుడు జార్జ్ గ్రీన్ అక్కడే ఉన్నాడు. అప్పుడామె ఆరు నెలల గర్బిణి. హంతకుడిని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఈ కేసులో అతనికి 16 సంవత్సరాల శిక్ష పడింది. మామూలుగా అయితే, 2002 తరువాత పెరోల్ పై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జైల్లో అతని ప్రవర్తన కారణంగా నాలుగు సార్లు పెరోల్ దరఖాస్తులను అధికారులు అనుమతించలేదు. దీంతో పూర్తి శిక్ష, ఆపై జైల్లో చేసిన నేరాలకు అదనపు శిక్ష అనంతరం 2008లో బయటకు వచ్చి, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 2010లో ఫెయిత్ అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలుండగా, తను ఇద్దరు పిల్లల్ని కన్నాడు. నాలుగు వారాల క్రితం రెండో బిడ్డకు నాలుగేళ్లు వచ్చిన సందర్భంగా పార్టీ కూడా చేసుకున్నాడు. సెప్టెంబర్ 1వ తేదీన గ్రీన్ కు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లభించింది. అంతా సుఖంగానే ఉందని భావిస్తున్నారా? కాదు. అంతకుముందే విడాకులు కావాలని కోర్టులో గ్రీన్ పిటిషన్ దాఖలు చేశాడు. బుధవారం నాడు విడాకులు కూడా లభించాయి. ఆ రోజు రాత్రి పోలీసులకు గ్రీన్ మరోసారి ఫోన్ చేశాడు. తాను తన భార్య సహా కుటుంబం మొత్తాన్ని (భార్య, నలుగురు పిల్లలు) హత్య చేశానని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకూ అతను ఎక్కడికీ వెళ్లలేదు. వారు వచ్చాక తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 1991లో అతను మొదటి భార్యను హత్య చేసిన విధంగానే ఇప్పుడు రెండో భార్యనూ హత్య చేశాడు. కారణాలు మాత్రం చెప్పని గ్రీన్, శిక్షకు సిద్ధమన్నాడు. ఇల్లాలి గృహహింసే దీనికి కారణమని భావిస్తున్నామని, 2013లో గ్రీన్ వ్యక్తిగత రక్షణ నిమిత్తం కోర్టును కూడా ఆశ్రయించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో అసలు నిజం వేరేదైనా ఉందా? అన్న కోణంలో దర్యాఫ్తు సాగిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.