: తెలంగాణ, ఏపీ సీఎంలతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలు తెలిపిన ఉమాభారతి
కృష్ణా జలాల వివాదంపై కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో డిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ తొలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కృష్ణా జలాల వివాదం అంశంపై చర్చించామని, సమావేశం సామరస్యంగా జరిగిందని అన్నారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తోన్న అభ్యంతరాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. నీటి లభ్యత ఆధారంగా అంచనా వేసి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీ జరుగుతుందని ఉమాభారతి తెలిపారు. అన్ని ప్రాజెక్టుల అంశాల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని అన్నారు. నీటి పంపిణీపై కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులతో నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. నివేదిక వచ్చాక సమస్యలను పరిష్కరించాలని ట్రైబ్యునల్‌ను కోరతామని చెప్పారు.