: నా మనవరాళ్లకి రాసిన లేఖ 'పింక్' సినిమా ప్రచారంలో భాగమే: అమితాబ్ బచ్చన్
గత నెలలో తన మనవరాళ్లు ఆరాధ్య బచ్చన్, నవ్య నవేలీ నందాలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం అమితాబ్ ను అభినందనల్లో ముంచెత్తింది. ప్రతి తాతయ్య తన మనవరాలితో చెప్పాలని భావించే సంగతులు, నేర్పాలని భావించే పాఠాలు ఆ లేఖలో అమితాబ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖను 'పింక్' సినిమా ప్రచారంలో భాగంగా తన మనవరాళ్లకి రాశానని అమితాబ్ తెలిపారు. తాను లేఖ రాసిన తరువాత తన కుమార్తె తనతో చెబుతూ, 'నాన్నా ఎన్నో ఏళ్లుగా నా కుమార్తెకు నేను చెప్పాలనుకుంటున్న ఎన్నో విషయాలను మీరు ఒక్క లేఖతో చెప్పేశారు. ఆ విషయాలు ఆమెకు నేర్పడమే కాదు, మేము కూడా అనుసరిస్తాము. ధన్యవాదాలు' అని చెప్పిందని ఆయన తెలిపారు. 'పింక్' సినిమా గురించి అందరూ తనను ప్రశ్నించేవారని, సినిమా కథ బయటకు తెలియకుండా సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చేదని, దీంతో నిర్మాత షుజిత్ సర్కార్ సూచన మేరకు ఈ లేఖ రాశానని ఆయన తెలిపారు. సినిమా సారాంశాన్ని తీసుకుని మీ మనవరాళ్లకే మీరు ఎందుకు లేఖ రాయకూడదు? అంటూ ఆయన ప్రశ్నించారని, అందుకే ఆ లేఖ రాశానని అమితాబ్ తెలిపారు. తాను రాసిన లేఖకు స్పందించిన తన కుమార్తె తిరిగి లేఖ రాయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఆయన చెప్పారు.