: లియాండర్ పేస్ అత్యంత ప్రమాదకారి: సానియా మీర్జా సంచలన ఆరోపణ
భారత టెన్నిస్ రంగంలో మరో వివాదం మొదలైంది. అగ్రశ్రేణి క్రీడాకారిణి సానియా మీర్జా, దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న లియాండర్ పేస్ పై సంచలన ఆరోపణలు చేసింది. పేస్ చాలా ప్రమాదకారి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో విరుచుకుపడింది. అంతకుముందు స్పెయిన్ తో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోటీల్లో ఘోర వైఫల్యం అనంతరం, పేస్ మీడియాతో మాట్లాడుతూ, సానియా మీర్జా - రోహన్ బోపన్నలను రియో ఒలింపిక్స్ మిక్సెడ్ డబుల్స్ విభాగానికి ఎంపిక చేయడంపై విమర్శలు గుప్పించాడు. ఈ ఒలింపిక్స్ లో భారత్, తన అత్యుత్తమ టీమ్ ను రంగంలోకి దింపడంలో విఫలమైందని అన్నాడు. 14 నెలల వ్యవధిలో నాలుగు గ్రాండ్ స్లామ్ లను గెలిచిన తనను వదిలేశారని ఆరోపించాడు. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన సానియా, విషపూరితమైన వ్యక్తిపై గెలవాలంటే, అతనితో ఆడకపోవడమే దానికి సరైన మార్గం అంటూ వ్యాఖ్యానించింది.