: కాలేజీకి వెళ్లే రోజుల్లో ఆకతాయిలు బాగా ఏడిపించేవారు: సినీ నటి తాప్సీ
ప్రముఖ నటి తాప్సీకి కూడా గతంలో ఆకతాయిల వేధింపులు తప్పలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా మీడియాతో చెప్పింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హారి, ఆండ్రియా తరియాంగ్ తదితరులు నటించిన ‘పింక్’ చిత్రం రేపు విడుదల కానుంది. మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా తాప్పీ మీడియాతో మాట్లాడుతూ, తాను ఢిల్లీలో పుట్టి పెరిగానని, ఈవ్ టీజింగ్ అనేది ఇక్కడ చాలా కామన్ అని చెప్పింది. ముఖ్యంగా కాలేజీ రోజుల్లో ఆకతాయిలు తమను ఏడిపించేవారని, బస్సులో ప్రయాణం చేసే సమయంలో మాపై ఎక్కడపడితే అక్కడ వారు చేతులు వేస్తుండేవారని, అసభ్యకరంగా ప్రవర్తించేవారని, ఇలాంటి అనుభవాలు తానెన్నో చవిచూశానని తాప్సీ చెప్పింది. ఆకతాయిలకు ఎందుకు బుద్ధి చెప్పలేదన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ‘ఎక్కడికి వెళ్లకూడదు, ఏమీ చేయకూడదు, ఫలానా దుస్తులు ధరించకూడదనే షరతులున్న వాతావరణంలో నేను పెరిగాను. దీంతో, అవతలివారు తప్పు చేసినా, నేను అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చేది. కొన్ని విషయాల్లో, పనుల్లో షరతులు మహిళలకే కానీ, పురుషులకు ఉండవు’ అని తాప్సీ వాపోయింది.