: 'ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్' విభాగంలో చైనాను వెనక్కు నెట్టేయనున్న ఇండియా!
గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానం నుంచి గాల్లోనే ఎగురుతున్న మరో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించే 'ఎయిర్ టు ఎయిర్ మిసైల్' వ్యవస్థతో కూడిన రఫాలే ఫైటల్ జెట్స్ డీల్ దాదాపు ఖరారైంది. ఫ్రాన్స్ కేంద్రంగా యుద్ధ విమానాలు తయారు చేసే రఫాలే సంస్థ వీటిని ఇండియాకు అందించనుండగా, ఈ తరహా అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ ల వద్ద లేకపోవడం భారత వాయుసేనను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రఫాలే సంస్థల మధ్య డీల్ ఇప్పటికే కుదిరిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానాలు శత్రు దేశాల యుద్ధ విమానాలను 100 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి, వాటిని గాల్లోనే పేల్చి వేయగలుగుతాయి. కాగా, అమెరికన్ సంస్థ మెటియోర్ తయారు చేస్తున్న ఏఐఎం-120 డీ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేయాలని ఇండియా భావిస్తోంది. ఈ విమానాలు రఫాలే కన్నా అత్యాధునికం కావడం, రఫాలేలతో పోలిస్తే, మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలగడం వీటి ప్రత్యేకత. ఒకసారి ఆకాశయుద్ధం మొదలైతే, వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని భావిస్తున్న మోదీ సర్కారు, ఇప్పటికే ప్రాథమిక డీల్ ను రఫాలేతో కుదుర్చుకుంది. ఇక తుది సంతకాలు ఈ సంవత్సరంలోనే జరుగుతాయని తెలుస్తోంది. మొత్తం 36 విమానాలు కొనుగోలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించిన వేళ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. తుది సంతకాలు పూర్తయితే, 2019 నుంచి విమానాల డెలివరీ ప్రారంభమవుతుంది.