: ఏపీలో నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు: వెంకయ్యనాయుడు


బ్రిక్స్ కు హాజరైన వ్యాపారవేత్తలు ఏపీలో నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే గానీ, పెట్టుబడి పెడతామని వాళ్లెవరూ చెప్పలేదని, హోదాకు, పెట్టుబడులకు సంబంధం లేదని వారికి తెలుసని అన్నారు. ‘ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తుందో తెలుసా, క్షుణ్ణంగా చెబుతాను.. సాధారణ తల్లులు, పెద్దగా చదువుకోని వారు కూడా ఇక్కడ ఉన్నారు. చదువుకున్న వాళ్ల కంటే చదువుకోని వాళ్లకే ఎక్కువ తెలివి ఉంటుంది. విశాఖ ప్రజలు తెలివైన వాళ్లు కాబట్టే హరిబాబును ఎన్నుకున్నారు. మామూలుగా ఒక పనికి కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు ఖర్చు పెడుతున్నదనుకోండి. అందులో అరవై రూపాయలు కేంద్రం, నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాయి. కేంద్ర పథకాలకు మామూలుగా డబ్బు ఖర్చు పెట్టే విధానం ఇది. ప్రత్యేక హోదా ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం తొంభై రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు ఖర్చు పెడతాయి. దానివల్ల తప్పనిసరిగా కొంత మేలు ఉంది. దీని వల్ల ఏమి జరుగుతుందని, మేము మొన్న లెక్కేశాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సుమారుగా ఒక పదివేల కోట్లు ఖర్చు పెడుతుందనుకుందాం. మామూలు ఫార్ములా ప్రకారం అయితే, కేంద్రం ఆరు వేల కోట్లు, రాష్ట్రం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్రం తొమ్మిది వేల కోట్లు, రాష్ట్రం వెయ్యికోట్లు ఖర్చు పెడతాయి. రాష్ట్రానికి హోదా రాకపోవడం వలన పడే భారం మూడు వేల కోట్ల రూపాయలను కూడా కేంద్రమే ఇచ్చి వేస్తే సమస్య పరిష్కారమైపోతుంది కదా? ఈ విషయాన్ని చంద్రబాబునాయుడుగారికి చెప్పాము. ఆ డబ్బును ఫారిన్ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా ఇస్తామని చెప్పాము. దానికి ఒప్పుకున్నారు. ఖర్చు పెట్టే దానిని బట్టి డబ్బు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది’ అని వెంకయ్యనాయుడు వివరించారు.

  • Loading...

More Telugu News