: అతనిని మించిన 'మ్యాన్ ఈటర్' ఈ నియంత!
'నేను మనిషి మాంసం తిన్నాను.. అంత రుచికరంగా లేదు' అని ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు గతంలో ఉగాండా మాజీ నియంత ఇడీ అమీన్. అయితే, అతనిని మించిన 'మ్యాన్ ఈటర్' నియంత ఒకరున్నారు. ఆయనే ఆఫ్రికా ఖండంలోని సబ్ సహారా దేశమైన ఈక్వెటోరియల్ గునియాను గత 37 ఏళ్లుగా పరిపాలిస్తున్న నియంత థియోడరో ఒబియాంగ్ ఎన్ గ్యూమా ఎంబసోగో (74). అపారమైన చమురు నిక్షేపాలపై ఆధారపడ్డ ఈ దేశ నియంత తన శత్రువుల చర్మాలు ఒలిపించి వారి అవయవాలు తినేస్తాడని గతంలో అతనితో సంబంధాలు నెరపిన సెవెరో మోటో తెలిపారు. ఓ రేడియో ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంబసోగో తనను తాను దేవుడిగా భావిస్తాడని అన్నారు. తన శత్రువులను నిర్దాక్షిణ్యంగా అంతమొందించే ఎంబసోగో వారి చర్మాలను ఒలిపించి, వారి అవయవాలు తినేస్తాడని ఆరోపించారు. తనకు ఎదురు నిలిచేవారిని అంతమొందించే హక్కు తనకు ఉందని భావిస్తాడని ఆయన అన్నారు. చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా లభించే ఆదాయం అంతా ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్లలోకే చేరుతోందని, అవినీతికి పరాకాష్ఠగా మారాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయనపై ఈ ఆరోపణలన్నీ కుట్రలో భాగమనీ, ఆయనను పదవీచ్యుతుడ్ని చేసి, చమురు నిక్షేపాలు చేజిక్కించుకునేందుకు జరిగే కుట్ర అని అతని అనుచరులు పేర్కొంటారు.