: తెలంగాణ ప్రభుత్వం భయపెడుతూ భూములు లాక్కుంటోంది, కోర్టులనూ తప్పుదోవ పట్టిస్తోంది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తాము ప్రాజెక్టులకి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే వ్యతిరేకమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు ఈరోజు టీపీసీసీ నేతలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రైతులను భయపెడుతూ భూములు లాక్కుంటోందని ఆరోపించారు. బలవంతపు భూసేకరణ చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. కనీసం గవర్నరయినా రాజ్యాంగాన్ని కాపాడాలంటూ తాము కోరినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోర్టులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు రావాలని ఆయన అన్నారు. కానీ, అక్రమదారుల్లో భూసేకరణ చేయొద్దని పేర్కొన్నారు. ఆందోళన చేస్తోన్న ముంపు బాధితులపై లాఠీఛార్జ్ చేయించడం అన్యాయమని అన్నారు. అన్ని విషయాలనూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.