: కోటంరెడ్డిని అడ్డుకున్న టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు... అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హైటెన్షన్!
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభలో గందరగోళం నెలకొనగా స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన వెనకకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే యామినిబాల (సింగనమల) ఆయన మాట్లాడుతున్న సమయంలోనే తాను మాట్లాడే యత్నం చేశారు. ఇలా ఒకేసారి మీడియాతో ఇద్దరు మాట్లాడటం సబబు కాదని కోటంరెడ్డి చెబుతున్నా... యామినిబాల వెనకడుగు వేయలేదు. దీంతో కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో టీడీపీకి చెందిన మరో మహిళా ఎమ్మెల్యే అనిత కూడా అక్కడకు చేరుకున్నారు. కోటంరెడ్డికి ఓ వైపు యామినిబాల నిలబడగా, మరోవైపు అనిత (పాయకరావుపేట) నిలబడ్డారు. కోటంరెడ్డి వ్యాఖ్యలను అక్కడికక్కడే ఖండించేందుకు వారిద్దరూ యత్నించారు. దీంతో కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి తీవ్ర స్వరంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనిత నోరు విప్పగానే ఆయన అక్కడి నుంచి వడివడిగా వెళ్లిపోయారు.