: ఇది పద్ధతి కాదు.. మీ గందరగోళాన్ని ఖండిస్తున్నా: వైసీపీపై శాసనసభలో చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జీఎస్‌టీ బిల్లుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జీఎస్‌టీ బిల్లు పదమూడు ఏళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉందని దాన్ని కేంద్రం ఎన్నో అడ్డంకులనెదుర్కొని ఆమోదింపజేసిందని అన్నారు. ఈ బిల్లుతో దేశానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అయితే మరోవైపు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రతిపక్షనేతల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి సాంప్రదాయం కాదని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. సభను గౌరవించాలని అన్నారు. ‘ఇది పద్ధతి కాదు.. మీ గందరగోళాన్ని ఖండిస్తున్నా.. ఖండిస్తున్నా.. ఖండిస్తున్నా.. మీకు చిత్తశుద్ధిలేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మీకు అవసరం లేదు. వారి కష్టాలపై చిత్తశుద్ధి లేదు. వైసీపీకి సిన్సియారిటీ లేదు. సభను అడ్డుకోవడం సరికాదు. సభ జరగడానికి సహకరించాలి. బిల్లుపై తీర్మానం కొనసాగించండి. ఆ తర్వాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం’ అని చంద్రబాబు అన్నారు.