: నీకూ బుర్హాన్ గతే!... హిజ్బుల్ చీఫ్ కు బీజేపీ మహిళా నేత వార్నింగ్!
జమ్ము కశ్మీర్ ను అల్లకల్లోలం చేసిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు బీజేపీ యువ మహిళా నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి షైనా నిన్న తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు యత్నించిన బుర్హాన్ వనీకి పట్టిన గతే మీకూ తప్పదంటూ ఆమె హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ‘‘కశ్మీర్ ను మరుభూమిగా మారుస్తామంటున్నవారు బుర్హాన్ వనీకి ఏ గతి పట్టిందో తమకూ అదే గతి తప్పదని తెలుసుకుంటే మంచిది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది అసమర్థ ప్రభుత్వం కాదన్న వాస్తవాన్ని హిజ్బుల్ తో పాటు సలావుద్దీన్ గ్రహించాలి. వేర్పాటువాదులతో పోరుకు మా ప్రధాని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇక మీ ఆటలు సాగవని తెలుసుకోండి’’ అని ఆమె ఓ రేంజిలో ఉగ్రవాదులకు వార్నింగిచ్చారు.