: రోజాకు కళ్లు కనిపించడం లేదా?: మంత్రి పీతల సుజాత
రాష్ట్రం కరవులో అల్లాడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు విహారయాత్రల నిమిత్తం గోవాకు వెళ్లారంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కరవులో ఉన్న రైతులను సీఎం ఆదుకున్నప్పుడు రోజా ఎక్కడుందని ప్రశ్నించిన ఆమె, సీఎం సహా మంత్రులంతా అనంతపురంలో ఉండి పంటలకు నీళ్లందించారని, కరవుపై వారు చేసిన పోరాటం రోజాకు కనిపించ లేదా? అని అడిగారు. రోజా విమర్శలు చూస్తుంటే, ఆమె కళ్లు మూసుకుపోయినట్టు ఉన్నాయని పీతల ఎద్దేవా చేశారు. పంటల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే, మరోమారు అత్యవసర నీటి తడులను అందిస్తామని ఆమె అన్నారు.