: నాకు నేనే టీచర్ని...అందుకే నాకే శుభాకాంక్షలు: రాంగోపాల్ వర్మ
ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది వేరొకదారి అని పెద్దలు పేర్కొంటారు... ఇది ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు అతికినట్టు సరిపోతుంది. టీచర్స్ డేను పురస్కరించుకుని వరుస ట్వీట్ల ద్వారా టీచర్లపై ద్వేషం వెళ్లగక్కిన వర్మ... తాను ఎవరి వద్ద నుంచి ఏదీ నేర్చుకోలేదని చెబుతూ తనకు తానే శుభాకాంక్షలు చెప్పుకున్నాడు. పనిలో పనిగా విద్యార్థులను స్కూలుకి వెళ్లవద్దంటూ సూచించాడు. గూగుల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని వారికి కొత్త పాఠాలు బోధించాడు. తాను తనకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లందర్నీ ద్వేషించేవాడినని, అందుకే ఎప్పుడూ క్లాసుకి వెళ్లకుండా సినిమాలకు వెళ్లేవాడనని, ఇప్పుడు వారందరికంటే మంచి స్థాయిలో ఉన్నానని అన్నాడు. టీచర్లను ద్వేషించడానికి కారణం క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని తెలిపాడు. కాలేజీ టీచర్లను ద్వేషించడానికి కారణం వారు బలవంతంగా చదివించడమని చెప్పాడు. స్కూల్ లో చదివినవి మర్చిపోయేందుకు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని వెల్లడించాడు. టీచర్లను అంతలా ద్వేషించే తాను మామూలుగా విస్కీ తాగనని, అయితే 'టీచర్స్ విస్కీ' అంటే ఇష్టమని అన్నాడు.