: హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యల నిరాహార దీక్ష ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తూ, గద్వాల, జనగామ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సంపత్ ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఒక రోజు దీక్షకు దిగారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన హన్మకొండ జిల్లా ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. అధికారం ఉందన్న అహంకారంతో ప్రభుత్వం ఏ మాటలు చెబితే వాటిని ప్రజలు నమ్మేస్తారని అనుకోవద్దని అన్నారు. కేసీఆర్‌కి విజన్ లేదని డీకే అరుణ విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం ఓ ప్రాతిపదిక లేకుండా ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం పాలన కొనసాగించడం లేదని, టీఆర్ఎస్ నేతల అభిప్రాయాల ప్రకారమే పాలన కొనసాగుతోందని ఆమె దుయ్యబట్టారు. ప్రజల్లోకి వచ్చి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు. ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, ప్రభుత్వ నేతలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విధివిధానాలు చెప్పకుండా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నారని పొన్నాల లక్ష్యయ్య విమర్శించారు. గద్వాల, జనగామ ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని అన్నారు.