: 'బ్రహ్మోస్'కు పోటీగా టాప్ సీక్రెట్ యుద్ధ విమానం 'జే-20'ని మోహరించిన చైనా
అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల సమాఖ్య జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని చైనా వెళ్లనున్న సమయంలో, తాము అత్యంత రహస్యంగా తయారు చేసిన స్టెల్త్ ఫైటర్ జే-20ని చైనా టిబెట్ లో మోహరించడం కలకలం సృష్టిస్తోంది. టిబెట్ లోని డోచెంగ్ యాడింగ్ ఎయిర్ పోర్టులో టార్పాలిన్ తో పూర్తిగా కప్పేసి పైకి కనిపించకుండా ఉన్న జే-20 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చిత్రాలు చైనా రక్షణ శాఖ వెబ్ సైట్లలో నేడు కనిపించాయి. ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న సివిల్ ఎయిర్ పోర్టు కావడం గమనార్హం. హిమాలయా ప్రాంతంలో బ్రహ్మోస్ క్షిపణులను చైనా వైపుగా భారత్ మోహరించిన నేపథ్యంలోనే జే-20ని టిబెట్ కు ఆ దేశం పంపిందని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై భారత ఆర్మీ అధికారి ఒకరు స్పందిస్తూ, "మేము దేశ భద్రత, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే బ్రహ్మోస్ లను మోహరించాం. ఏ దేశాన్నీ భయపెట్టాలని కాదు" అన్నారు. కాగా, ట్విన్ ఇంజన్ తో పనిచేసే జే-20 శబ్ద వేగం కన్నా స్పీడుగా వెళుతూ, రాడార్లకు చిక్కకుండా తప్పించుకుని శత్రువులపై బాంబుల వర్షం కురిపించి రాగలదు.