: సరోగసీ కొత్త విధానంపై బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ విసుర్లు
'ఏం తినాలి? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎవరి ద్వారా పిల్లల్ని కనాలి? అన్నవి ఒకరితో చెప్పించుకునే దేశంలో బతుకుతున్నామా?' అని బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సరోగసీ విధానం అపహాస్యమవుతోందన్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, అనుప్రియ వంటి వారి వ్యాఖ్యలపైన, సరోగసీ విధానంపైన ఫరా ఖాన్ మాట్లాడుతూ, ఈ బిల్లు సరైన కారణంతో వచ్చి ఉంటే తాను ఆమోదించేదానినని అన్నారు. అయితే ఈమధ్య కాలంలో చాలా మంది సరోగసీ ఫ్యాషన్ అయిపోయిందని మాట్లాడుతున్నారని, అదొక ఫ్యాషనా? తనకు తెలిసినంత వరకు ఏ మహిళా ఫ్యాషన్ కోసం ఇలాంటి విధానాలను అనుసరించదని ఆమె తెలిపింది. తాను 40 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నానని, మరో ఐదేళ్లు ఆగి ఉంటే తనకు 45 ఏళ్లు వచ్చి ఉండేవని, కానీ 43 ఏళ్లకే ఐవీఎఫ్ పధ్ధతిలో తల్లినై ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చానని ఆమె చెప్పింది. 45 వరకు ఆగి ఉంటే పిల్లల్ని కనడం అసాధ్యమై ఉండేదని ఆమె పేర్కొంది. సరోగసీ బిల్లుకు తాను వ్యతిరేకం కానప్పటికీ...ఏం తినాలి? ఏ దుస్తులు వేసుకోవాలి? ఎవరి ద్వారా పిల్లల్ని కనాలి? వంటి విషయాలు ఒకరితో చెప్పించుకునే దేశంలో బతుకుతున్నామా? అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.