: స్వల్ప నష్టాల్లో మార్కెట్... 11 శాతం దిగజారిన ఐడియా, 6.5 శాతం పడిపోయిన ఎయిర్ టెల్
సెషన్ ఆరంభం నుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన బెంచ్ మార్క్ సూచికలు చివరి గంట వ్యవధిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా, భారత స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించిన జియో ప్లాన్, టెలికం రంగ కంపెనీలను చావుదెబ్బకొట్టగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు అత్యధికంగా నష్టపోయాయి. ఐడియా 10.91 శాతం, ఎయిర్ టెల్ 6.48 శాతం దిగజారాయి. ఇదే సమయంలో జియో నుంచి ప్రస్తుత టారిఫ్ రేట్ల ప్రకారం ఇప్పటికిప్పుడు భారీ ఆదాయం వచ్చే అవకాశాలు లేవని నిపుణులు చేసిన వ్యాఖ్యలతో రిలయన్స్ సంస్థ ఈక్విటీ 3 శాతం నష్టపోయింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 28.69 పాయింట్లు పడిపోయి 0.10 శాతం నష్టంతో 28,423.48 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 11.55 పాయింట్లు పడిపోయి 0.13 శాతం నష్టంతో 8,774.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.38 శాతం, స్మాల్ కాప్ 0.39 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభపడ్డాయి. గెయిల్, లుపిన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,902 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,081 కంపెనీలు లాభాలను, 1,653 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,10,60,698 కోట్లుగా నమోదైంది.