: టీ, సమోసా, గులాబ్‌జామ్‌ల కోసం రూ.9 కోట్లు ఖర్చు చేసిన యూపీ సర్కార్!
టీ, సమోసా, గులాబ్‌జామ్‌ల కోసం ఉత్తరప్రదేశ్ సర్కార్ రూ.9 కోట్లు ఖర్చు చేసిందట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌కుమారే స్వయంగా చెప్పారు. ఈరోజు ఆ రాష్ట్ర శాసనసభలో ఆయన తమ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన ఖర్చుల గురించి వివరించి చెప్పారు. దానిలో ప్రభుత్వాధికారుల వద్దకు అతిథులు వచ్చినప్పుడు, అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు అయిన ఖర్చులన్నింటినీ గురించి వివరించారు. ఈ సందర్భంగా అతిథులకి, అధికారులకి టీ, కాఫీ, సమోసా, గులాబ్‌జామ్, మిక్చర్ వంటి స్నాక్స్ ఇవ్వడానికి నాలుగేళ్లలో 8,78,12,474 (దాదాపు 9 కోట్లు) రూపాయలు ఖర్చయిందని వెల్లడించారు. ఈ ఖర్చులను అత్యధికంగా ఎవరు చేశారో, అత్యల్పంగా ఎవరుచేశారో కూడా చెప్పారు. అత్యధికంగా మంత్రి అరుణ్‌కుమార్ కోరి 22,93,800 ఖర్చు చేస్తే, మంత్రి సదాబ్ ఫాతిమా అత్యల్పంగా రూ.72వేలు స్నాక్స్ కోసం ఖర్చు చేశారట. మరో మంత్రి అజామ్ ఖాన్ రూ.22 లక్షలు ఉపయోగించేశారట. అఖిలేష్ ఈ ప్రకటన చేయగానే ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రజాధనాన్ని అఖిలేష్ ప్రభుత్వం దోచుకుందని బీజేపీ విమర్శించింది. ప్రజాసంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసి స్నాక్స్ కోసం 9 కోట్ల రూపాయలు వినియోగించడం ఏంటని దుయ్యబట్టింది. విమర్శలను అధికార పార్టీ సమర్థించుకునే ప్రయత్నాలు చేసింది.