: ఆ రోజు రేవంత్‌రెడ్డి వచ్చిన కారుని నడిపింది లోకేశ్ డ్రైవరే.. ఎవరి చెవిలో పూలు పెడతారు?: బొత్స
కేసుల నుంచి తప్పించుకునేందుకు టీడీపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతలు తప్పులు చేయడమే కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఆరోజు టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వచ్చిన కారుని నడిపింది ఆ పార్టీ యువనేత లోకేశ్ డ్రైవరేనని బొత్స పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పలు అసత్యాలు పలుకుతున్నారని, ఎవరి చెవిలో పూలు పెడతారని ఆయన దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో నిందితులు ఆ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బొత్స ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో రాష్ట్రంలో కరవులేదని గొప్పలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారిక నివేదికల్లో కరవులేదని పేర్కొంటున్నారని ఆయన అన్నారు. కరవుపై తప్పుడు ప్రకటనలు చెయ్యొద్దని బొత్స సూచించారు.