: 'భార్య మృతదేహాన్ని మోసుకెళ్లిన' ఘటన చాలా బాధ కలిగించింది: ఒడిశా సీఎం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. స్వగ్రామానికి భార్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక, పుట్టెడు దుఃఖంతో భుజాన భార్య శవాన్ని మోసుకుని వెళ్లిన మాఝీ ఉదంతం తనను కలచివేసిందని అన్నారు. దీనిపై విచారణకు ఆదేశించానని ఆయన చెప్పారు. భాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా, ఇలాంటి కష్టాలు ఇకపై ఉండకూడదని భావించి ఒడిశాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మరణించిన పేద వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ‘మహాప్రయాణ’ పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. ఏమైనా, ఈ సంఘటనపై విచారణ జరిగితే కానీ వాస్తవాలు వెలుగు చూడవని, విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.