: చార్మినార్ దగ్గర జనాల మధ్య ప్రత్యక్షమై.. చెడ్డీలు అమ్మిన బాలీవుడ్ నటుడు!
బాలీవుడ్ సినిమాల ప్రచారం రూటే సెపరేటు. తాము నటించిన సినిమాలకి పబ్లిసిటీ చేసుకోవడానికి చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఎంతగా కష్టపడి పోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ తారలు చేసే ఆ సందడే వేరు. ఓ వైపు టీవీల్లో తమ సినిమాకు సంబంధించిన ప్రకటనలు ఇస్తూనే, అటు సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టరు. అంతేగాక, స్వయంగా సినీహీరోలే ప్రేక్షకుల ముందుకు వెళ్లి వారిని అలరిస్తూ తమ సినిమాని ప్రచారం చేసుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కూడా అలాగే హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ప్రత్యక్ష్యమయ్యాడు. ఈ హీరో అక్కడ చెడ్డీలు అమ్ముతూ దర్శనమిచ్చాడు. భజరంగీ భాయ్ జాన్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపించి అందరినీ అలరించిన ఆయన.. 'ఫ్రీకీ అలీ' సినిమాలో హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రచారంలో భాగంగా జనాలని ఆకట్టుకోవడానికి ఇలా చెడ్డీలు అమ్మే వ్యక్తిగా అవతారమెత్తాడు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కూడా సిద్ధీఖీ చెడ్డీలు అమ్ముతాడట. అందుకే చార్మినార్ వద్ద చెడ్డీలను విక్రయిస్తూ తన సినిమాని ప్రచారం చేసుకున్నాడు. సిద్ధీఖీ చెడ్డీలు అమ్ముతుండడం చూసిన జనం చిరునవ్వులు చిందిస్తూ అతడితో ముచ్చటిస్తూ ఎంజాయ్ చేశారు. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన అలీ అనే అబ్బాయి దేశం గర్వించదగ్గ పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడుగా తయారు కావడమే ఈ సినిమా కథాంశం. ప్రచారం సందర్భంగా చిత్రం టీమ్ అంతా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి చేసింది.