: అమెరికా యుద్ధ నౌకను వేధించిన ఇరాన్ షిప్పులు!
గల్ఫ్ తీరంలో ఉన్న అమెరికన్ యుద్ధ నౌక 'యూఎస్ఎస్ నిట్జే' ను నాలుగు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకలు వెంటపడి వేధించాయి. సిరియాలోని ఉగ్రవాదులను అణచివేసేందుకు జరుగుతున్న పోరాటంలో సహకరించేందుకు ఈ యుద్ధనౌక గల్ఫ్ తీరానికి వచ్చింది. అయితే, బుధవారం నాడు నాలుగు ఇరాన్ షిప్ లు ఈ నౌక వెంటపడ్డాయి. రెండు నౌకలైతే పలుమార్లు అమెరికన్ నావికులు హెచ్చరిస్తున్నా వినకుండా 300 గజాల దూరంలోకి వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమని, హెచ్చరికలను పట్టించుకోని వేళ, తాము ఏదైనా చర్యలు తీసుకుంటే, అది అంతర్జాతీయ అశాంతికి కారణమయ్యేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అమెరికన్ నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. కాగా, అమెరికన్ సైన్యం తమ దేశంపై నిఘా ఉంచేందుకే యూఎస్ఎస్ నిట్జే మోహరించిందని ఇరాన్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. సిరియాలో ఖండాంతర క్షిపణుల తయారీకి పూనుకున్న అధ్యక్షుడు బషల్ అల్-అసద్ కు ఇరాన్ సహకరిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పలు ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కాగా, ఇరాన్ నౌకలకు 12 సార్లు హెచ్చరికలు పంపినా అవి స్పందించలేదని, 10 సార్లకు పైగా వార్నింగ్ కాల్పులు జరిపామని అమెరికన్ నావీ వర్గాలు వెల్లడించాయి. తమ నౌక వద్దకు ఇంత దగ్గరగా రావడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు.