: ప్రోటోకాల్ కూడా పక్కనపెట్టి సింధుని స్వయంగా ఆహ్వానించా: చంద్రబాబు
చిన్న చిన్న దేశాలకి మెడల్స్ వస్తున్నాయని, పెద్ద దేశమయిన భారత్‌కు రావట్లేదని బాధపడుతోన్న సమయంలో బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు పతకం తెచ్చి భారత ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో మెరిసిన భారతీయ మహిళ.. తెలుగు బిడ్డ సింధు అని ప్రశంసించారు. ఏదైనా ఒక మంచి జరగాలంటే దాని వెనకాల ఒక ప్రేరణ అవసరమని.. పుల్లెల గోపిచంద్ సింధుకి ఎంతో ప్రేరణనిచ్చారని చంద్రబాబు అన్నారు. సింధు తల్లిదండ్రులు ఆమెను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన అన్నారు. ప్రోటోకాల్ కూడా పక్కనబెట్టి సింధుని స్వయంగా ఆహ్వానించానని చంద్రబాబు అన్నారు. ‘ఆరోజు మల్లీశ్వరికి పతకం వచ్చింది.. ఆరోజు మీలాగే గోపిచంద్ ప్రేక్షకుడిలా కూర్చొని ఆ కార్యక్రమాన్ని చూశాడు. ఎంతో స్ఫూర్తిని పొందాడు. బ్యాడ్మింటన్ స్టార్ అయ్యాడు. ఆనాడు గోపిచంద్ అకాడమీ నెలకొల్పడానికి సహకరించాను. ఈనాడు అందులో శిక్షణ తీసుకున్న క్రీడాకారిణి సింధు రియో ఒలింపిక్స్‌లో సత్తా చూపి, భారత ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా చాటింది’ అని చంద్రబాబు అన్నారు. ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి ప్లేయర్లను తయారు చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ప్రోత్సహిస్తే చైనా, అమెరికా కంటే బాగా ఆడేవారు భారత్‌లో తయారవుతారు. భారత్‌లో ఒలింపిక్స్ గేమ్స్ జరగాలి. దానికి అన్ని రకాల సౌకర్యాలు కావాలి. దేశంలో అటువంటి గేమ్స్ నిర్వహిస్తే ఎంతో మంది క్రీడాకారులు వాటిల్లో ఆడాలనుకుంటారు. క్రికెట్ ఒక్కటే కాదు, అన్ని ఆటలకు ప్రాధాన్యత రావాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇండియాలో ఎక్కడాలేనటువంటి మంచి సౌకర్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయంటే ఆనాడు తాము కలిపించిన సౌకర్యాలే కారణమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆనాడు ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ ను ఎంతో సమర్థంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఆనాడు గోపిచంద్ అకాడమీ కి భూమిచ్చాను, ఈరోజు ఆ ఫలితం వచ్చింది' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు తాము ఎంతో ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.