: మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కీలక ఒప్పందం నేడే!... ముంబైకి బయలుదేరనున్న కేసీఆర్!
కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు నేడు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన కాళేశ్వర, ప్రాణహిత ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాదు జిల్లా సరిహద్దులో పెన్ గంగపై సంకల్పించిన చనాక- కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఓ అవగాహనకు రానున్నాయి. ఈ మేరకు నేడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లనున్నారు. నగరంలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ వేదికగా జరగనున్న ఈ కీలక భేటీలో కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సాగునీటి శాఖ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే... తెలంగాణను పట్టి పీడిస్తున్న సాగునీటి కష్టాలు తీరినట్లేనని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఒప్పందానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు పలువురు మంత్రులు నిన్ననే ముంబై చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నేటి మధ్యాహ్నం కేసీఆర్ ముంబై వెళతారు.