: మాపై ఉగ్రదాడి చేసిన వారు ఇండియాలోకీ చొరబడ్డారు: టర్కీ మంత్రి


తమ దేశంపై ఉగ్రదాడులకు దిగుతున్న ఫెతుల్లా గులెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఈటీఓ), ఇండియాలోకీ చొరబడిందని టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లూ వ్యాఖ్యానించారు. ఎఫ్ఈటీఓ ఎంతో రహస్యంగా నేరాల నెట్ వర్క్ ను విస్తరించుకుంటోందని, దురదృష్టవశాత్తూ ఇండియాలోని పాఠశాలలకు, కొన్ని సంస్థలకూ విస్తరించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన, పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ విషయమై ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో మాట్లాడానని అన్నారు. ఏఏ దేశాల్లో ఎఫ్ఈటీఓ ఉందో, ఆ దేశాలనన్నింటినీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఇక ఎఫ్ఈటీఓ విషయమై టర్కీ సూచనలపై విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ, ఇది చాలా సున్నితమైన అంశమని, ఎఫ్ఈటీఓతో సంబంధాలున్న అసోసియేషన్ల మూసివేత అంశంలో చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయేమోనన్న కోణంలో సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు టర్కీతో కలసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు.

  • Loading...

More Telugu News