: చంద్రబాబు పాపాలను దేవుడు కూడా క్షమించడు: వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈరోజు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల పుష్కర స్నానాలకు వెళ్లి కృష్ణానదిలో మునిగిపోయి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను కృష్ణా జిల్లాకు వస్తున్నానని తెలిసి సర్కారు హడావుడిగా రూ.3 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. పుష్కర స్నానానికి వెళ్లిన విద్యార్థులను ఈతకెళ్లి చనిపోయారని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని జగన్ ఆరోపించారు. ఏటూరు పుష్కర ఘాట్‌కు ఇదే దారి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీల్లో అన్నీ టీడీపీ ఎమ్మెల్యే బొమ్మలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇసుక మాఫియాను చంద్రబాబు ప్రోత్సహించడం వల్లే ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగి మృతి చెందారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాపాలను దేవుడు కూడా క్షమించడని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో గాంధీ విగ్రహాలకు రక్షణలేదు, వైఎస్సార్ విగ్రహాలకు రక్షణలేదని ఆయన అన్నారు. మరోవైపు ప్రభుత్వం అడ్డగోలుగా దేవాలయాలను కూల్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.