: ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లకు కోటిన్నర నజరానా ప్రకటించిన సల్మాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని సహనటులు ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే, తనకి కోపం వస్తే ఎంత తీవ్రంగా స్పందిస్తాడో... ప్రేమిస్తే కూడా అంత గొప్పగానూ ప్రేమిస్తాడని, ఆపదలో ఆదుకుంటాడని అతని గురించి తెలిసిన వారు చెబుతారు. దానిని మరోసారి చేతల్లో చూపించాడు. భారత్ తరపున రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రోత్సాహక నగదు అందజేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందు కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేయనున్నాడు. రియోలో పాల్గొన్న 118 మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి 1,01,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తోందని, దానికి మనం కూడా సాయం చేయాలని సల్లూ భాయ్ పిలుపు నిచ్చాడు. 'ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్' అనే స్వచ్ఛంద సంస్థ క్రీడాకారులకు అందిస్తున్న సాయం, వారి అభివృద్ధికి చేస్తున్న కృషిని సల్మాన్ అభినందించాడు. వారికి జియో లాంటి కంపెనీలు సహకరించడం అభినందనీయమని తెలిపాడు. సచిన్ తో పాటు సల్మాన్ ను కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ సహృద్భావ రాయబారిగా నియమించిన సంగతి విదితమే!