: కేవలం పాఠాలు మాత్రమే చెబుతామంటే పిల్లలు బడికి రారు!: ఆదర్శ ఉపాధ్యాయుడు నాగరాజు మాస్టారు
కేవలం పాఠాలు మాత్రమే చెబుతాము, నేర్చుకోండి అంటూ బోధిస్తే పిల్లలు స్కూలుకు రారని ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. నాగరాజు అందరు ఉపాధ్యాయుల్లాంటి వ్యక్తి కాదు... ఆదర్శ ఉపాధ్యాయుడు. కర్ణాటకలోని రామదేవర బెట్ట ప్రాథమిక పాఠశాలలో 16 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుడిగా నాగరాజు విధులు ప్రారంభించారు. గిరిజన తెగలకు చెందిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 36 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే, బడికి రాకుండా చాలా మంది పిల్లలు పనుల్లోకి పోతున్నారు. పైగా, తెల్లవారు జామునే వీరి పనుల్లోకి వెళ్లాలి. దీంతో ఎలాగైనా ఆ పిల్లలను స్కూలుకు తీసుకువచ్చి విద్యా బుద్ధులు నేర్పాలని ఆ స్కూలు ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రోజూ ఉదయమే లేచి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ, అంగన్ వాడీ టీచర్ సుశీలతో కలిసి ఒక వైపు... నాగరాజు మరోవైపు చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ చిన్నారులను స్కూలుకు తీసుకొస్తారు. వారికి స్కూల్ లోనే స్నానాలు చేయించి మంచి దుస్తులు వేస్తారు. తరువాత భోజనం పెట్టి పాఠాలు చెబుతారు. ఇందుకు వారు బడిలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పిల్లలకు క్షవరం కూడా బడిలోనే చేయించిన రోజులున్నాయని నాగరాజు చెబుతారు. కేవలం చదువు కోసమే అంటే పిల్లలు స్కూలుకి రారని, వారికి విద్య పట్ల ఆసక్తి కలిగేలా తామీ పనులు చేస్తున్నామని ఆయన చెబుతారు. భవిష్యత్ పై ఆశకల్పించడమే తన పని అని... తానలా చేయకపోతే భవిష్యత్తులో ఈ పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల్లాగే దినసరి కూలీలుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ చుట్టుపక్కల ఊర్లలో నాగరాజు మాస్టారు అంటే తెలియని వారు ఉండరు. నాగరాజు మాస్టారు వస్తున్నారంటే చాలు 'సారొస్తున్నారంటూ పరుగులు తీస్తూ ఎదురొస్తారని, ఒక ఉపాధ్యాయుడిగా తనకు అంతకన్నా ఇంకేం కావాలి?' అని ఆయన ప్రశ్నిస్తారు. ఉపాధ్యాయుడు అనే పదానికి ఆయన సరైన నిర్వచనంలా అనిపించడం లేదూ?