: డెక్కల బాబును చాలా సార్లు ఆదుకున్నా: యాదగిరి
హైదరాబాదులోని ఓల్డ్ బోయిన్ పల్లిలో తనపై కాల్పులు జరిపిన డెక్కల (డాకూరి) బాబును చాలా సార్లు ఆదుకున్నానని గాయపడ్డ కాంగ్రెస్ నేత యాదగిరి తెలిపారు. కాల్పుల ఘటన నుంచి పూర్తిగా కోలుకున్న యాదగిరి మీడియాతో మాట్లాడుతూ, తనకు ఎవరితోనూ విభేదాలు లేవని అన్నారు. బాబుతో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బాబును ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు చెబుతున్నట్టు తనకు నేర చరిత్ర ఉండి ఉంటే గ్యాంగ్ ను నడిపేవాడిని కదా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తనను హతమార్చే కుట్ర చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.