: ప్రాణాలు పోయాల్సిన వైద్యురాలు ప్రాణం తీసింది... ఆస్తి కోసం తండ్రి ఊపిరి తీసిన కూతురు!
ఆస్తి కోసం వైద్యుడైన తన తండ్రి ప్రాణాలను వైద్యురాలైన కూతురు తీసేసిన సంఘటన చెన్నైలో జరిగింది. చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడ్డాయి. చెన్నైకి చెందిన డాక్టర్ రాజగోపాల్ (82) కుమారుడు జయప్రకాష్ కూడా వైద్యుడే. కీల్ పాక్ లో ఆదిత్యా ఆసుపత్రిని జయప్రకాష్ నిర్వహిస్తున్నాడు. అనారోగ్యం బారినపడ్డ తండ్రిని తన ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి ఆయన చికిత్స అందిస్తున్నాడు. ఇక, రాజగోపాల్ కుమార్తె, జయప్రకాష్ సోదరి అయిన జయసుధ కూడా వైద్యురాలే! ఆమధ్య ఒకరోజున తన తండ్రిని చూసేందుకని జయసుధ, ఆమె భర్త మనోహరన్, కొడుకు డాక్టర్ హరిప్రసాద్ లతో కలిసి ఈ ఆసుపత్రికి వచ్చింది. తన తండ్రితో మాట్లాడే పని ఉందని చెప్పి, అక్కడి నుంచి కొంచెం సేపు బయటకు వెళ్లాలని నర్సులకు చెప్పడంతో వారు బయటకు వెళ్లిపోయారు. వెంటనే, తన తండ్రి వద్దకు వెళ్లిన జయసుధ, తమ వెంట తెచ్చుకున్న ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని ఆయన్ని కోరింది. అందుకు నిరాకరించిన తండ్రితో బలవంతంగా ఆయన వేలిముద్రలు వేయించుకుంది. ఆ తర్వాత ఆయన శ్వాస తీసుకుంటున్న ఆక్సిజన్ మాస్క్ ను తొలగించడంతో పాటు, ఆయనకు పెట్టి ఉన్న సెలైన్ ట్యూబ్ ను కూడా కత్తిరించివేశారు. ఆ తర్వాత నర్సులు లోపలికి రావడంతో వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ సంఘటన అనంతరం రాజగోపాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించి గత నవంబర్ 2న ఆయన మరణించారు. తన తండ్రి ప్రాణాలు పోవడానికి తన సోదరి చేసిన పనే కారణమని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్న కొడుకు జయప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. బలవంతంగా ప్రాణాలు తీసి, వైద్య వృత్తికి ద్రోహం చేసిన తన సోదరి, బావ, మేనల్లుడు ఆ వృత్తికి అనర్హులంటూ, వారి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ జయప్రకాష్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.