: 7 ఎయిర్ సెల్ సర్కిళ్లను సొంతం చేసుకున్న ఎయిర్ టెల్
భారత టెలికం చరిత్రలో మరో పెద్ద డీల్ కుదిరింది. ఎయిర్ సెల్ నిర్వహిస్తున్న 7 సర్కిళ్లలోని 4జీ తరంగాలపై హక్కులను ఎయిర్ టెల్ సొంతం చేసుకుంది. ఎయిర్ సెల్ కు ఎనిమిది సర్కిళ్లలో స్పెక్ట్రమ్ లైసెన్సులు ఉండగా, ఇకపై వాటిల్లో ఏడింటిని ఎయిర్ టెల్ నిర్వహించనుంది. ఈ ఏడు చోట్ల ఎయిర్ టెల్ కు తరంగాల లైసెన్సులు ఇప్పటివరకూ లేకపోగా, ఈ డీల్ తో దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉన్న సంస్థగా రిలయన్స్ జియో సరసన ఎయిర్ టెల్ నిలువనుంది. తమిళనాడు, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అసోం, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా సర్కిళ్లలో ఎయిర్ సెల్ కు ఉన్న అన్ని 4జీ తరంగాల హక్కులను కొన్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ డీల్ కు డీఓటీ నుంచి, టెలికం శాఖ నుంచి అనుమతి లభించిందని, 20 మెగాహెర్జ్, 2300 బ్యాండ్ పై బీడబ్ల్యూఏ తరంగాలను తాము వాడుకుంటామని ఎయిర్ టెల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ డీల్ విలువ రూ. 3,500 కోట్లు. ఈ సంవత్సరం ఏప్రిల్ 8న డీల్ గురించిన ప్రకటన తొలిసారి వెలువడగా, అనుమతులు అన్నీ లభించి, ఒప్పందం నిజమవడానికి నాలుగు నెలల సమయం పట్టింది. తమ ఒప్పందం సెప్టెంబర్ 20, 2030 వరకూ కొనసాగుతుందని ఇరు సంస్థలూ ప్రకటించాయి.