: కుంభకర్ణుడిలా నిద్రపోయిన మోదీ, ఇప్పుడే లేచి కూర్చున్నారు: మాయావతి నిప్పులు


గడచిన రెండేళ్లుగా కుంభకర్ణుడిలా నిద్రపోయిన నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపించగానే లేచి కూర్చున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. యూపీ ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసమే, ఆయన దళితులపై కపట ప్రేమను చూపడం ప్రారంభించారని ఆరోపించారు. యూపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని గుర్తు చేసిన ఆమె, అందువల్లే మోదీకి దళితులపై అకస్మాత్తుగా ప్రేమ పొంగుకు వస్తోందని ఎద్దేవా చేశారు. "తనకు ఒక్క దళితుడి ఓటు కూడా పడదని ఆయనకు తెలుసు. అందుకే వారిని మంచి చేసుకునేందుకు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు" అని నిప్పులు చెరిగారు. కాగా, మోదీ గత వారాంతంలో, గో రక్షకుల పేరిట దళితులపై దాడులు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆపై హైదరాబాద్ లో మాట్లాడుతూ, దళితులను ఏమీ అనవద్దని, కావాలంటే తనను కాల్చాలని కూడా ప్రధాని అన్నారు.

  • Loading...

More Telugu News