: లోక్ సభ ముందుకు నేడు జీఎస్టీ బిల్లు!... అన్ని పార్టీల ఎంపీలకు విప్ జారీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు నేడు లోక్ సభ ముందుకు రానుంది. సుదీర్ఘ కాలంగా ఆమోదం పొందకుండా ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురవుతున్న ఈ బిల్లుకు ఈ దఫా ఆమోదం లభించి తీరుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో చర్చలు జరపడమే కాకుండా ఆ పార్టీ సూచించిన మేరకు జీఎస్టీ బిల్లుకు మార్పులు చేర్పులకు మోదీ సర్కారు సరేనంది. దీంతో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో సభలో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇప్పటికే బీజేపీ కూడా తన ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ కూడా తమ ఎంపీలకు విప్ లు జారీ చేశాయి.