: గుజరాత్ గవర్నర్ తో రూపానీ భేటీ!... ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ప్రతిపాదన!
గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన విజయ్ రూపానీ కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీతో భేటీ అయ్యారు. గుజరాత్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నితిన్ పటేల్ ను వెంటబెట్టుకుని రాజ్ భవన్ వెళ్లిన రూపానీ... ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అనుమతివ్వాలని గవర్నర్ ను కోరారు. ఆనందీబెన్ పటేల్ స్వచ్ఛంద రాజీనామా నేపథ్యంలో గుజరాత్ కు కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ మంతనాల అనంతరం నితిన్ పటేల్ ను వెనక్కు నెట్టేసిన బీజేపీ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రూపానీకి సీఎంగా అవకాశం కల్పించించిన విషయం తెలిసిందే. గవర్నర్ తో చర్చల అనంతరం పదవీ ప్రమాణానికి సంబంధించి రూపానీ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.