: 'అల్లా' పేరు ఉచ్చరించినందుకు విమానం నుంచి ముస్లిం దంపతుల దించివేత
పారిస్ నుంచి సిన్సినాటి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ముస్లిం దంపతులు ‘అల్లా’ అన్నారనే ఆరోపణతో విమాన సిబ్బంది వారిని విమానం నుంచి దించేశారు. ఇస్లామోఫోబియాతో బాధపడుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది తమను అకారణంగా విమానం నుంచి దించివేసి అవమానించారని పాకిస్థాన్-అమెరికన్ దంపతులైన నజియా(34), ఫైసల్ అలీ ఆరోపించారు. నజియా తన తల్లిదండ్రులకు టెక్స్ట్ మెసేజ్ పంపించిన అనంతరం సీట్లో సర్దుకు కూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో విమాన సిబ్బంది వచ్చి ఆ దంపతులను గమనించారు. సీట్లో ఆమె అసౌకర్యంగా కదులుతుండడం, ఆమె భర్తకు చెమట పట్టి ఉండడాన్ని గుర్తించిన వారు వెంటనే ఈ విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, అల్లా అని అన్నారని ఫిర్యాదు చేశారు. పైలట్ ఈ విషయాన్ని గ్రౌండ్ సిబ్బందికి తెలియజేయడంతో విమానం నుంచి ముస్లిం దంపతులను దించివేశారు. తమను గ్రౌండ్ ఏజెంట్ పలు ప్రశ్నలు అడిగాడని, తమ వస్తువులను తనిఖీ చేశారని నజియా ఆరోపించారు. ఈ విమానంలో మీరు ప్రయాణించలేరని వారు తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. విచారణ అనంతరం ముస్లిం దంపతులను పోలీసులు విడిచిపెట్టారు. ఈ ఘటనపై ముస్లిం అడ్వొకసీ గ్రూప్ డెల్టా ఎయిర్ లైన్స్‌పై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కు ఫిర్యాదు చేసింది.