: అతనిది దురహంకారమే: అమీర్ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మనోహర్ పారికర్
దేశం వీడి వెళ్లాలని తన భార్య కోరుకుంటున్నట్టు 'మత అసహనం' పెరిగిన వేళ, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్రంగా తప్పుబట్టారు. "ఓ నటుడు, అతని భార్యా ఇండియాను వదిలి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది దురహంకారంతో కూడిన మాట. నేను పేదవాడినై, చిన్న ఇల్లే నాకుంటే, దాన్నే ప్రేమిస్తూ, భవిష్యత్తులో పెద్ద ఇల్లు కట్టుకోవాలని కల కంటాను" అని ఆయన అన్నారు. సియాచిన్ పై నితిన్ గోఖలే రచించిన పుస్తకం మరాఠీ అనువాదాన్ని ఆవిష్కరించిన పారికర్ ఆపై అమీర్ పేరును ప్రత్యక్షంగా వెల్లడించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత సంవత్సరం నవంబరులో అమీర్ దేశాన్ని వీడి వెళ్లాలని ఉన్నట్టు వ్యాఖ్యానించగా, తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యా పిల్లలు ఇండియా అంటే భయపడుతున్నారని కూడా నాడు అమీర్ వ్యాఖ్యానించాడు.