: ఢిల్లీ ఎయిర్ పోర్టులో డీఎంకే ఎంపీపై ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పిడిగుద్దులు!
తమిళనాట డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎంతటి రాజకీయ వైరముందన్నది అందరికీ తెలిసిందే. ఇక ఢిల్లీ ఎయిర్ పోర్టు సాక్షిగా, ఈ పార్టీ నేతల మధ్య వైరం ఎలా ఉందో మరోసారి వెల్లడైంది. కొంతమంది ప్రయాణికులు వెల్లడించిన కథనం ప్రకారం, ఏఐఏడీఎంకే ఎంపీ శశికళా పుష్ప, డీఎంకే ఎంపీ త్రిచి శివ (ఇద్దరూ రాజ్యసభ సభ్యులే) జెట్ ఎయిర్ వేస్ విమానంలో చెన్నైకి టికెట్లను బుక్ చేసుకున్నారు. సెక్యూరిటీ చెక్ వద్ద శశికళ ఉన్న వేళ, ఆమెకు 15 అడుగుల దూరంలో శివ ఉన్నారు. వీరిద్దరి మధ్యా ఏదో విషయంపై వాదన జరిగింది. ఇద్దరూ తమిళంలో మాట్లాడుకోవడంతో ఏం వాదన జరిగిందన్న విషయమై చుట్టూ ఉన్నవారికి విషయం తెలియలేదు. ఆపై ఆగ్రహంతో శివ వద్దకు వచ్చిన శశికళ, ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. చుట్టూ ఉన్న వారు విస్తుపోయి చూడటం మినహా మరేమీ చేయలేదని తెలుస్తోంది. ఆపై విమానం ఎక్కేందుకు ఇద్దరికీ అనుమతి లభించలేదు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదూ రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జరిగిన ఘటనపై ఇద్దరు ఎంపీలూ స్పందించలేదు.